రచయత ఖజానా
తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం, నవంబరు 2006 – విశేషాలు
ఈ విశేషాలు రాయడానికి నాకు చాలా సంతోషంగాఉంది. ఎందుకంటే, ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన తెలుగు బ్లాగర్ల సమావేశం ఇదే కాబట్టి. వేదిక దూరమైనా గత సమావేశాలకంటే ఈసారి వచ్చినవారి సంఖ్య అధికం. (ఫొటోలు వస్తున్నాయి.)
ఈ సమావేశాలన్నింటి ప్రత్యేకతేంటంటే, ప్రతీసారీ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సమయం తెలియకుండా సాగిపోతాయి. మీరు సమావేశానికి రాలేదంటే, ఖచ్చితంగా ఏదో మిస్సవుతునారనే. హైదరాబాదులో లేనివారు, మీరూ మీ నగరం లేదా పట్టణంలో బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం నిర్వహించండి. ఇక హైదరాబాదులో ఉండి రాలేకపోతున్నవారు, రావడానికో సాకు వెతుక్కోండి. తర్వాతి హైదరాబాదు సమావేశం డిసెంబరు 10, ఆదివారం నాడు, మీ కోసం ఎదురుచూస్తుంటాం!.
అనుకున్నట్టుగానే అందరం హైదరాబాదు యూనివర్సిటీకి చేరాం. అందరం మొదట కలిసింది కాంటీన్ దగ్గర. పానీయాల తర్వాత (కొంత ఆలస్యంగా వచ్చినవారికి లేకుండానే), మార్గదర్శి మీద చర్చ మొదలెట్టారు. మొత్తం మీద రామోజీరావుకి అప్పులకన్నా ఆస్తులే ఎక్కువున్నాయని, కాకపోతే ఈ యాగీకి ఆయన ప్రతిస్పందన చెల్లింపులు ఎలా చేస్తారో అన్నదానిపై మరింత నిర్ధిష్టంగా ఉండాల్సిందనీ అభిప్రాయపడ్డాం.
ఈలోగా, వెబ్ లో తెలుగు గురించిన కరపత్ర కాపీలని, వెంకటరమణ తీసుకొచ్చాడు. ఈ కరపత్రాన్ని చావా కిరణ్ అభ్యర్ధన మేరకు నేను చేసా. మీరిక్కడనుండి దిగుమతి చేసుకొని ప్రచారానికి వాడుకోవచ్చు.) వాటిని తీసుకొని లోపలికి బయలుదేరాం.
యూనివర్సిటీలో మాకు సహాయంగా కశ్యప్ వాళ్ళ తమ్ముడు (భార్గవ్ రామ్) ఉన్నాడు. (తనక్కడ ప్రదర్శన కళ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.) కరపత్రాలు అంటిస్తూ, వివిధ విభాగాలకి దారిచూపుతూ, చివరగా జరిగిన చర్చలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు.
ఇలా కరపత్రాలు అంటిస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, ఒక చోట పచ్చికమీద చతికిలపడ్డాం. భార్గవ్ యొక్క బ్లాగెందుకు అన్న సందేహం తీర్చడానికి చదువరి అందరం మనమెందుకు బ్లాగుతున్నామో చెప్పమనడంతో, ఒక్కొక్కరూ తమ బ్లాగోతం వరుసగా చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియలో, కంప్యూటర్లో తెలుగు చూడవచ్చు, రాయవచ్చు అని ఎవరెవరు ఏవిధంగా తెలుసుకున్నారో తెలియజెప్పారు. 1998 లో తీవ్రవాదుల వద్ద పోలీసులకి దొరికిన లాప్ టాప్ లో ఎర్ర సాహిత్యం తెలుగులో చూసి ఆశ్చర్యపోయి, ఇంగ్లీష్ వికీపీడియా పరిచయమై అక్కడనుండి తెలుగు వికీపీడియా గురించి తెలిసి, వాకా మరియు చావా కిరణ్ ల బ్లాగులు మెయిల్లు చూసి, యుడిట్ తో తిప్పలుపడి మరీ తెలుగు రాసి, ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కధ. బ్లాగు కురువృద్దుల నుంది బ్లాపాయిలవరకు అందరి సంగతులు వినడం బాగుంది.
ఇలా బ్లాగోతాలు సరదాగా సాగుతుండగానే చీకటి చిక్కనవడం మొదలుపెట్టింది. ఓ ఛాయ్ తాగి నిష్క్రమిద్దామని అక్కడినుండి లేచాం. ఇక కాంటీన్లో టీ తాగుతూ ఇంకా మనం ఏంచేయాలి అన్న దానిమీదని చర్చ మళ్ళింది.
ఈనాడు ఆదివారంలో వికీ ముఖచిత్ర కధ వల్ల తెవికీలో 500 పైబడి సభ్యులు చేరారు. వీరందరిచే నిలకడగా అర్ధవంతమైన చేర్పులు ఎలా చేయించాలి. ఇంకో వారానికి వీళ్ళకి తెవికీ గుర్తుంటుందా? వీరందరికీ వారి సభ్యత్వాన్ని గుర్తుచేస్తూ ఈ-మెయిల్లు పంపవచ్చా? స్వాగత సందేశాన్ని మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దగలమా? వికీమీడియా వారి మెయిలింగులిస్టు మన తెలుగుకీ ఒకటి ప్రత్యేకంగా ఒకటి సృష్టించాలా?
ఇక కార్యాచరణ అంశాలతో ఈ సంగతులని ముగిస్తాను.
- వివిధ వెబ్ ఇంటర్ఫేసుల స్థానికీకరణకి మన ప్రయత్నాలు మందగించాయి. వీటిని మళ్ళీ ఓ పట్టు పట్టాలి:
- మీ భాషలో గూగుల్: వందశాతం పూర్తయినట్టు అక్కడున్నా, అందులో ఇంకా దాదాపుగా నలభై శాతం తెంగ్లీషులో ఉన్నాయి. వీటిని తెలుగులిపిలోకి మార్చాలి.
- వర్డ్‌ప్రెస్ అనువాదం
- తెవికీలో అచేతన సభ్యులని క్రియాశీలురయేలా ప్రేరేపించడం (వారినెలా చేరాలి?)
- కంప్యూటర్లో తెలుగు చూడవచ్చు రాయవచ్చు అని జనావళికి తెలియజేయడం. (చాలామందికింకా తెలియదు.)
- ఇతర నగరాలు, పట్టణాల్లో తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశాలకి ఆయా సభ్యులని ప్రోత్సహించడం
—వీవెన్.
సెప్టెంబర్ నెల తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాద్ — అజెండా
సమయం: 2006-9-17 3:30pm – 2006-9-17 5:30pm (ఈ సారి సాయంత్రం)
వేదిక: హంగ్రీ జాక్స్ బెకరీ, సంజీవ రెడ్డి నగర్ (అక్కడ నిర్ణయిద్దాం.)
చర్చనీయాంశాలు:
- చరసాల గారి ప్రతిపాదన (తెలుగుబ్లాగర్లు మరియు సమాజ సేవ) పై చర్చ
- పత్రికలో వ్యాసం ప్రచురణ పురోగతి పై సమీక్ష
- తెలుగు ఉపకరణం పురోగతి పై సమీక్ష
- వివిధ వెబ్సైట్ల స్థానికీకరణకి మన కృషిపై సమీక్ష (వివిధ వెబ్ సైట్లకి మన అనువాదాలు, వెబ్ సైట్ల తెలుగీకరణ మొ.వి.)
- తర్వాతి సమావేశానికి సమయం మరియు వేదిక నిర్ణయం
- చిన్న పిల్లలకి తెలుగునేర్పేవిధంగా ఒక వెబ్ సైట్ (లేదా వికీ పుస్తకాలలో వ్యాసాలు)
- మరే విషయమైనా (ప్రతిపాదించండి)
ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమావేశపు విశేషాలు
- తెలుగు బ్లాగులపై వ్యాసాన్ని ఏదైనా ఒక పత్రికలో ప్రచురించడానికి కృషి: ప్రస్తుత (తెవికీ లోని) వ్యాసాన్ని ప్రచురింపజేయడానికి మురళి కృష్ణ (కూనపరెడ్డి) తన ప్రయత్నం కొనసాగిస్తాడు. ఒక పత్రిక ప్రచురించిన వ్యాసం మరో పత్రిక వాళ్ళు వేసుకోరు కనుక మరో పత్రిక కోసం మరో వ్యాసం రాస్తే భాస్కరరావుగారు తనకున్న పరిచయాలతో ప్రయత్నం కొనసాగిస్తారు.
- గతంలో చేసిన పుస్తకాల పురుగు లాంటి ప్రయోగాలు మరో రెండు: (1) మీ మీ బ్లాగులలో మీ వెబ్ కార్యక్రమాల గూర్చి రాయండి. మీరే వెబ్సైట్లు చూస్తూఉంటారు. వాటిలో మీకు నచ్చిన అంశాలేంటి. ఇలా. (2) నా చేతి తెలుగు రాత — తెలుగులో మీ చేతిరాత ఇలా ఉంటుందో స్కాన్తీసి మీ బ్లాగులో ఒక టపా రాయండి. మన తెలుగు బ్లాగరులలో గ్రాఫాలజీ తెలిసినవారెవరైనా ఉంటే వారు ఈ చేతిరాతలని విశ్లేషిస్తూ బ్లాగు టపా(లు) రాయవచ్చు.
- తెలుగువారికి సంబంధించిన వెబ్సైట్లు తెలుగులో కూడా (యూనికోడ్లో) లభ్యమయ్యేలా మనవంతు కృషి చెయ్యాలి. ఇందుకోసం వెబ్మాస్టర్లకి అవసరమైన సాంకేతిక సహాయాన్ని తెవికీలో (లేదా మరో వెబ్సైట్లోనో) ఉంచాలి. ఇలాంటి సమాచారం ఈసరికే వెబ్‌లో ఉందేమో చూడాలి. వైవిధ్యభరితమైన విషయాలపై తెలుగులో వెబ్సైట్లు రావడానికి ఇది ఎంతైనా ఉపయోగపడుతుంది. వెబ్సైట్ల నిర్వాహకులకు, యజమానులకు ఈ-మెయిళ్ళు రాయాలి. ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారితో (ఉ.దా. తెలుగు బ్రెయిన్స్) కలిసి పనిచేసే అవకాశాల్ని పరిశీలించాలి.
- పెద్దవారి వద్దకు: మన తెలుగు బ్లాగులని, తెవికీని ప్రముఖ వ్యక్తులకు పరిచయంచేసి వారినికూడా బ్లాగులో, తెవికీలోనో రాసే విధంగా ప్రేరేపించాలి. ఉ.దా.: యండమూరి, గొల్లపూడి వంటి వారు. దీనికై ముందుగా కొందరు ప్రముఖుల పేర్లు, వారిని ఎలా సంప్రదించాలి అనుకుంటే మనలో ఎవరికైనా వారు తెలిసిఉంటే వారికి నేరుగానూ లేదా మనల్ని పరిచయం చేసుకుంటూనో విషయాన్ని వారికి తెలియజేయవచ్చు.
- కంప్యూటర్ని తెలుగుకి సిద్దంచేసే ఉపకరణం: మనలో సాంకేతిక నిపుణులందరూ తలో చేయి వేయండి. saroavar.orgలో ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే ఎలాఉంటుంది? అందరూ కలిసి దానిపై కృషిచేయవచ్చు. మరిన్ని వివరాలకు మురళి కృష్ణ (కూనపరెడ్డి) లేదా చంద్రశేఖర్ లని సంప్రదించండి.
- ఇక మన తెలుగు బ్లాగర్లకి (ఎక్కడివారైనా) అందరికీ ఒకే వేదిక. దానికో పేరు కూడా అనుకున్నాం. తెలుగు బ్లాగర్ల ప్రపంచ వేదిక. ఇది ఇక ఏమాత్రం హైదరాబాదుకి పరిమితం కాదు. మీరున్న నగరం లేదా ఊరిలోని తెలుగు బ్లాగర్లు కలిసి నెలనెలా సమావేశాలు నిర్వహించండి. ఆ విశేషాలని ఈ బ్లాగుకి లేదా తెలుగుబ్లాగు గూగుల్ సమూహానికి టపా చేయండి. పైన చెప్పిన అన్ని అంశాల్లోనూ మీ వంతు సహకారాన్ని అందించండి
-వీ
కంప్యూటర్‌కి తెలుగు నేర్పే ఉపకరణం
ఈ విడత తెలుగు బ్లాగర్ల సమావేశంలో చర్చించిన తెలుగు ఉపకరణానికి ఇది ఆవశ్యక విశ్లేషణ పత్రం. అన్ని సాంకేతిక వివరాలు ఇక్కడ చర్చించలేదు. ముందుగా ఎలా చెయాలో అనుకొని ఆ ప్రకారం చేసుకుపోవడమే.
లక్ష్యం:
* వాడకందారు యొక్క కంప్యూటర్ని తెలుగుకి (చదవ మరియు రాయగల్గడానికి) సిద్ధంచేయడం. (ఈ ఉపకరణం కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారైనా సులభంగా ఉపయోగించేవిధంగా ఉండాలి.)
ఊహాజనిత ఉపయోగిత విధానం:
1. వాడకందారు మన ఉపకరణాన్ని ఒక వెబ్‌పేజీ నుండి దిగుమతి చేసుకుంటాడు. (ఒకవేళ మన ఉపకరణం అన్ని నిర్వాహక వ్యవస్థ (నివ్య) లకి సరైనది కాకపోతే, ఈ వెబ్‌పేజీ వాడకందారు ఉపయోగిస్తున్న నివ్యకి అనుగుణమైన వెర్షన్‌నే చూపిస్తుంది.)
2. దిగుమతిచేసుకున్న ఉపకరణాన్ని వాడకందారు నడుపుతాడు.
3. మన ఉపకరణం ఈ ఈ పనులు చేస్తుంది:
(అ) తెలుగు చూడడానికి కంప్యూటర్ సిద్ధంగా ఉందోలేదో చూడడం:
(i) నివ్య XP అయితే: సంక్లిష్ట లిపులకి కావాల్సిన తోడ్పాటుని చేతనం చేయడం. (Control Panel > Regional Settings > Languages > Install files for complex script languages)
(ii) నివ్య Windows98/ME/2000: IE6 విహరిణి, USP10 DLL, మరియు పోతన ఫాంట్లని నిక్షిప్తం చేయడం.
(iii) లినక్స్ అయితే: పాంగోతో కూడిన ఫైర్ఫాక్స్, పోతన ఫాంట్లని నిక్షిప్తం చేయడం.
(ఆ) తెలుగు రాయడానికి సిద్ధంగా ఉందోలేదో చూడడం:
(i) నివ్య XP అయితే: తెలుగు IMEని చేతనం చేయడం. దాంతోబాటు ఇటీవలే విడుదలైన మైక్రోసాఫ్ట్ భాషా ఇండియా వారి ఫొనెటిక్ ఎడిటర్ని కూడా నిక్షిప్తం చేయడం.
(ii) లినక్స్ అయితే తదనుగుణంగా
(ఇ) వాడకందారు యొక్క సౌలభ్యంకోసం (టైపింగ్ మరియు ఇతర) సహాయాన్ని కూడా కంప్యూటర్లో భద్రపరుస్తుంది.
గమనిక: పైన చెప్పిన కొన్ని ఉపకరణాల్ని మనం (న్యాయపరమైన ఇబ్బందులవల్ల) మూటగట్టి ఇవ్వలేకపోతే, అప్పటికప్పుడే వెబ్ నుండి దిగుమతిచేసి నిక్షిప్తంచేయాలి.
తెలుగు ప్రోగ్రామర్లూ, ఈ ఉపకరణం తయారీలో సహాయపడండి. దీని సాధ్యాసాధ్యాలను, అమలుచేయడంలో ఉన్న ఇబ్బందులను చర్చించండి. మరిన్ని వివరాలని చేర్చండి.
తెలుగు బ్లాగర్ల సమావేశం (జూలై 2006) విశేషాలు
తెలుగు బ్లాగర్ల సమావేశం — జూలై 2006
హాజరు: భాస్కర రావు, చంద్రశేఖర్, కశ్యప్, చదువరి, వీవెన్, వెంకట రమణ,
మరియు మురళీ కృష్ణ కూనపరెడ్డి
త్రివిక్రమ్ జ్వరం కారణంగా రాలేకపోయాడు. అతను త్వరగా కోలుకోవాలని
ఆశిద్దాం. ఈసారి విశేషం: నలుగురు కొత్తవాళ్ళు! ముందు అనుకున్నట్టుగా
హంగ్రీ జాక్స్ దగ్గర కలిసాం. చదువరి, వెంకట రమణ, నేను ఒక జట్టుగా…
రావుగారు, చంద్రశేఖర్, కశ్యప్ మరో జట్టుగా వేచిచూస్తున్నాం (పక్క
పక్కనే). వీళ్ళు వాళ్ళే కావచ్చు వాళ్ళు వీళ్ళే కావచ్చు అనుకొన్నా, కశ్యప్
ఫోన్ చెయ్యడంతో అందరం ఒక జట్టయ్యాం. అక్కడినుండి వెంగళరావు నగర్ పార్కుకి
వెళ్ళి అక్కడ చర్చ మొదలెట్టాం. ఇంకొద్ది సేపటికి మురళీ కృష్ణ కూడా
చేరాడు. ఎప్పటిలాగే సమయం తెలియలేదు,రెండు గంటల కన్నా ఎక్కువసేపే
కూర్చున్నాం (పార్క్ కాపరి తాళం వేసుకోవాలి అంటున్నాకూడా ఒక్క గంటే అని
అతనికి నచ్చజెప్పి మరీ).
ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. వాటిలో ముఖ్యమైనవీ, చేయవలసినవి ఇవీ:
1. తెలుగులో రాసే మహిళా బ్లాగర్లకు అవార్డులు (బయో సింఫనీ తరపున):
దీనిపై భాస్కరరావుగారు సవివరమైన ప్రకటన చేస్తారు. రాబోయే కాలంలో, ఈ
అవార్డుల కార్యక్రమాన్ని అన్ని తెలుగు బ్లాగులకి కూడా వర్తింపజేసే
ఉద్దేశం ఉంది.
ఈ అవార్డుల ప్రధానాన్ని, వార్తాంశంగా పత్రికల, TVల వారికి చేరవేసే బాధ్యత
కశ్యప్‌ది.
2. కంప్యూటర్‌కి తెలుగు నేర్పడం:
కంప్యూటరున్న ప్రతి తెలుగువాడూ తమ కంప్యూటర్లో తెలుగు చూడడం, రాయడం
చేయగలగాలి. అందుకు అనుగుణంగా కంప్యూటర్ని మలచడం, సాధారణ వాడకందార్లకు
కష్టం. ఈ పనిని సులభం చేయడానికి ఒక వెబ్‌పేజీనో/అప్లికేషనో తయారుచేయాలి.
దీనిపై ఒక ఆవశ్యకాల విశ్లేషణ (Requirements Analysis) పత్రం నేను
(వీవెన్) తయారుచేస్తా. ఇక అసలు ప్రోగ్రామింగ్ బాధ్యత చంద్రశేఖర్, మురళి
కృష్ణలది.
3. తెలుగు బ్లాగుల గురించి ప్రజలకు తెలియజేయడం:
“కొత్త పుంతలు తొక్కుతున్న నేటి తెలుగు బ్లాగులు” అన్న శీర్షికతో
భాస్కరరావుగారు ఒక వ్యాసం రాస్తారు. దీన్ని వెంకట రమణ సాంఖ్యీకరించి
(digitize) తెలుగుబ్లాగు సమూహానికి పోస్ట్ చేస్తాడు. సభ్యులందరూ వారి
వారి అభిప్రాయాలను, సూచనలను తెలియజేయవచ్చు. వీటన్నింటినీ సమీక్షించి ఆ
వ్యాసాన్ని పత్రికలలో ప్రచురణకి సిద్ధంచేయడంలో భాస్కరరావుగారికి, చదువరి
సహాయమందిస్తారు.
4. రాబోయే తెలుగు బ్లాగు సమావేశాలని, “నగరంలో ఈనాడు” వంటి శీర్షికలలో
చోటుచేసుకోవడానికి కశ్యప్ కృషిచేస్తాడు.
5. బ్లాగులపై బ్లాకింగ్‌ని ఎత్తివేసారు కాదా, ఆ విషయంపై ఇప్పుడు
పత్రికలకి రాయడం మనం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కనుక ఆ
ప్రయత్నాన్ని విరమించాం.
తర్వాతి సమావేశానికల్లా ఇవన్నీ పూర్తవాలి.
హైదరాబాదులో ఉంటున్న తెలుగు బ్లాగర్లందరూ ఈ సమావేశాలకి వస్తారని ఆశిస్తున్నాం.
ఇటీవలి వ్యాఖ్యలు