Archive for నవంబర్, 2006

తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం, నవంబరు 2006 – విశేషాలు

ఈ విశేషాలు రాయడానికి నాకు చాలా సంతోషంగాఉంది. ఎందుకంటే, ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన తెలుగు బ్లాగర్ల సమావేశం ఇదే కాబట్టి. వేదిక దూరమైనా గత సమావేశాలకంటే ఈసారి వచ్చినవారి సంఖ్య అధికం. (ఫొటోలు వస్తున్నాయి.)

ఈ సమావేశాలన్నింటి ప్రత్యేకతేంటంటే, ప్రతీసారీ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సమయం తెలియకుండా సాగిపోతాయి. మీరు సమావేశానికి రాలేదంటే, ఖచ్చితంగా ఏదో మిస్సవుతునారనే. హైదరాబాదులో లేనివారు, మీరూ మీ నగరం లేదా పట్టణంలో బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం నిర్వహించండి. ఇక హైదరాబాదులో ఉండి రాలేకపోతున్నవారు, రావడానికో సాకు వెతుక్కోండి. తర్వాతి హైదరాబాదు సమావేశం డిసెంబరు 10, ఆదివారం నాడు, మీ కోసం ఎదురుచూస్తుంటాం!.
అనుకున్నట్టుగానే అందరం హైదరాబాదు యూనివర్సిటీకి చేరాం. అందరం మొదట కలిసింది కాంటీన్ దగ్గర. పానీయాల తర్వాత (కొంత ఆలస్యంగా వచ్చినవారికి లేకుండానే), మార్గదర్శి మీద చర్చ మొదలెట్టారు. మొత్తం మీద రామోజీరావుకి అప్పులకన్నా ఆస్తులే ఎక్కువున్నాయని, కాకపోతే ఈ యాగీకి ఆయన ప్రతిస్పందన చెల్లింపులు ఎలా చేస్తారో అన్నదానిపై మరింత నిర్ధిష్టంగా ఉండాల్సిందనీ అభిప్రాయపడ్డాం.

ఈలోగా, వెబ్ లో తెలుగు గురించిన కరపత్ర కాపీలని, వెంకటరమణ తీసుకొచ్చాడు. ఈ కరపత్రాన్ని చావా కిరణ్ అభ్యర్ధన మేరకు నేను చేసా. మీరిక్కడనుండి దిగుమతి చేసుకొని ప్రచారానికి వాడుకోవచ్చు.) వాటిని తీసుకొని లోపలికి బయలుదేరాం.

యూనివర్సిటీలో మాకు సహాయంగా కశ్యప్ వాళ్ళ తమ్ముడు (భార్గవ్ రామ్) ఉన్నాడు. (తనక్కడ ప్రదర్శన కళ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.) కరపత్రాలు అంటిస్తూ, వివిధ విభాగాలకి దారిచూపుతూ, చివరగా జరిగిన చర్చలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు.

ఇలా కరపత్రాలు అంటిస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, ఒక చోట పచ్చికమీద చతికిలపడ్డాం. భార్గవ్ యొక్క బ్లాగెందుకు అన్న సందేహం తీర్చడానికి చదువరి అందరం మనమెందుకు బ్లాగుతున్నామో చెప్పమనడంతో, ఒక్కొక్కరూ తమ బ్లాగోతం వరుసగా చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియలో, కంప్యూటర్లో తెలుగు చూడవచ్చు, రాయవచ్చు అని ఎవరెవరు ఏవిధంగా తెలుసుకున్నారో తెలియజెప్పారు. 1998 లో తీవ్రవాదుల వద్ద పోలీసులకి దొరికిన లాప్ టాప్ లో ఎర్ర సాహిత్యం తెలుగులో చూసి ఆశ్చర్యపోయి, ఇంగ్లీష్ వికీపీడియా పరిచయమై అక్కడనుండి తెలుగు వికీపీడియా గురించి తెలిసి, వాకా మరియు చావా కిరణ్ ల బ్లాగులు మెయిల్లు చూసి, యుడిట్ తో తిప్పలుపడి మరీ తెలుగు రాసి, ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కధ. బ్లాగు కురువృద్దుల నుంది బ్లాపాయిలవరకు అందరి సంగతులు వినడం బాగుంది.

ఇలా బ్లాగోతాలు సరదాగా సాగుతుండగానే చీకటి చిక్కనవడం మొదలుపెట్టింది. ఓ ఛాయ్ తాగి నిష్క్రమిద్దామని అక్కడినుండి లేచాం. ఇక కాంటీన్లో టీ తాగుతూ ఇంకా మనం ఏంచేయాలి అన్న దానిమీదని చర్చ మళ్ళింది.

ఈనాడు ఆదివారంలో వికీ ముఖచిత్ర కధ వల్ల తెవికీలో 500 పైబడి సభ్యులు చేరారు. వీరందరిచే నిలకడగా అర్ధవంతమైన చేర్పులు ఎలా చేయించాలి. ఇంకో వారానికి వీళ్ళకి తెవికీ గుర్తుంటుందా? వీరందరికీ వారి సభ్యత్వాన్ని గుర్తుచేస్తూ ఈ-మెయిల్లు పంపవచ్చా? స్వాగత సందేశాన్ని మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దగలమా? వికీమీడియా వారి మెయిలింగులిస్టు మన తెలుగుకీ ఒకటి ప్రత్యేకంగా ఒకటి సృష్టించాలా?

ఇక కార్యాచరణ అంశాలతో ఈ సంగతులని ముగిస్తాను.

  • వివిధ వెబ్ ఇంటర్ఫేసుల స్థానికీకరణకి మన ప్రయత్నాలు మందగించాయి. వీటిని మళ్ళీ ఓ పట్టు పట్టాలి:
    • మీ భాషలో గూగుల్: వందశాతం పూర్తయినట్టు అక్కడున్నా, అందులో ఇంకా దాదాపుగా నలభై శాతం తెంగ్లీషులో ఉన్నాయి. వీటిని తెలుగులిపిలోకి మార్చాలి.
    • వర్డ్‌ప్రెస్ అనువాదం
  • తెవికీలో అచేతన సభ్యులని క్రియాశీలురయేలా ప్రేరేపించడం (వారినెలా చేరాలి?)
  • కంప్యూటర్లో తెలుగు చూడవచ్చు రాయవచ్చు అని జనావళికి తెలియజేయడం. (చాలామందికింకా తెలియదు.)
  • ఇతర నగరాలు, పట్టణాల్లో తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశాలకి ఆయా సభ్యులని ప్రోత్సహించడం

—వీవెన్.

ప్రకటనలు

నవంబర్ 13, 2006 at 1:45 ఉద. 8 వ్యాఖ్యలు


నవంబర్ 2006
సో మం బు గు శు
« సెప్టెం    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

ఇటీవలి టపాలు